Pages

Tuesday, July 31, 2012

వంకాయ ఉల్లికారం


వంకాయలు : ఐదు 
ఉల్లిపాయలు : రెండు 
టమాటాలు : రెండు ( వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతె లేదు) 
వెల్లుల్లి రాబ్బలు : నాలుగు 
ధనియాలు, జీరకర్ర : రెండు స్పూన్లు 
నూని : ఒక చిన్న కప్పు 
పసుపు చిటికెడు 
ఉప్పు తగినంత 
ఎందు మెరపకాయలు : పది 

ముందుగా మూకుడులో ధనియాలు జీరకర్ర వేసుకొని కొంచం వేగాక పక్కన పెట్టుకోవాలి, అందులో కాస్త నూని వేసి మెరపకాయలు వేయించుకోవాలి. అవి పక్కన పెట్టుకొని, ఆ ముకుడులోనే కాస్త నూని వేసి అందులో ఉల్లిపాయలు, టమాటాలు, దోరగా వేగనివ్వాలి, అందులోనే వేల్లుల్లిరబ్బలు వేసుకోవాలి. ఇవన్నిటిని కాస్త పసుపు ఉప్పు వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత ఆ గిన్నేలోనే కాస్త నూని వేసి వంకాయలని వేగనివ్వాలి. కాస్త వేగాక అందులో ఈ ఉల్లిముద్ద ని కూరి మళ్ళి వేగనివ్వాలి. ఇలా ఒక ఐదు, పది నిమిషాలు వేగాక చివర్లో కాస్త కొత్తిమీరి చల్లుకొని అన్నలో కలుపుకొని తింటే బాగుంటుంది.

బీన్స్ కొబ్బరి కూర



కావల్సినవి: 

బీన్స్ 1/4 కే.జి 
కొబ్బరి తురుము 1/2 కప్పు 
ఆవాలు 1/2 స్పూన్ 
మినపప్పు 1/2 స్పూన్ 
జీలకర్ర 1/2 స్పూన్ 
ఇంగువ - చిటికెడు 
ఎండుమిరపకాయ - 2 
కరివేపాకు - 2 రబ్బలు 
నూనె 2స్పూన్ 
ఉప్పు తగినంత 

బీన్స్ సన్నగా తరిగి ఉడికించు కోవాలి. 
నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపట లాడేకా ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా కొబ్బరి తురుము వేసి వేయించాలి. 
కొబ్బరి వేగాక ఉడికించిన బీన్స్ వేసి, ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి.

గుత్తివంకాయ కూర



గుత్తివంకాయ కూర (Tomato):

వంకాయలు- ఐదు,
టమాటాలు- మూడు, 
నువ్వులు- అరచెంచా,
ఎండుకొబ్బరి తురుము- అరకప్పు,
వేరుసెనగపప్పు- పావుకప్పు,
ఎండుమిర్చి- నాలుగు,
రసంపొడి- చెంచా,
చింతపండు గుజ్జు - కొద్దిగా,
ఉప్పు- రుచికి తగినంత, నూనె- మూడు చెంచాలు, తాలింపు దినుసులు- చెంచా, బెల్లం తురుము- పావుకప్పు, పసుపు- పావుచెంచా, ఇంగువ- చిటికెడు, కొత్తిమీర తురుము - కొద్దిగా

తయారీ:
బాణలిలో అరచెంచా నూనె వేసి వేరు సెనగపప్పు, నువ్వులు, కొబ్బరి తురుము వేయించి పెట్టుకోవాలి. టమాటా, బెల్లం తురుము, ఉప్పు మిక్సీలో వేసి గుజ్జులా చేసి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న వేరుసెనగపప్పు, కొబ్బరి తురుము, నువ్వుల్ని కూడా పొడిలా చేసి టమాటా గుజ్జుకు కలపాలి. ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి నాలుగు భాగాలుగా కోసి సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వాటిల్లో కూరాలి. వెడల్పాటి పాన్‌ తీసుకుని నూనె వేడిచేసి తాలింపు దినుసులు వేయించి పసుపు, ఇంగువ వేయాలి. ఆ తరవాత వంకాయలు, చింతపండు గుజ్జు, రసంపొడి ఒకదాని తరవాత ఒకటి చేర్చి మూత పెట్టేయాలి. వంకాయలు బాగా మగ్గాక మంట తగ్గించి, మిగిలిన టమాటా మిశ్రమం కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లితే చాలు.. కమ్మని టమాటా గుత్తి వంకాయ కూర సిద్ధం.

బీరకాయ నువ్వుల గుండ



కావలసిన పదార్థాలు
బీరకాయ:పావు కిలో(చిన్న ముక్కలుగా తరిగినవి)
ఉప్పు:తగినంత
పసుపు:చిటికెడు
నూనె: 2 టీస్పూ
నువ్వుల పొడి: అర కప్పు
పోపు: ఆవాలు, జీలకర్ర, ఎండు మిరప కాయలు, కరివేపాకు


తెల్లనువ్వులు:పావు కప్పు
ఎండు మిరపకాయలు: 5-7
ముందుగా ఒక బాణెలి లో తెల్లనువ్వులు, మిరపకాయలు వేసి చిన్న మంటపై వేయించుకోవాలి.
నువ్వులపప్పు కొంచెం ఎర్రగ అయిపోగానే స్టవ్ మీదనించి తీసివేయాలి. బాగా చల్లరాక మెత్తగ పొడి చేసుకోవాలి.
ఈ పొడి కొద్ది రోజులు నిలవ వుంటుంది. వేడి మీద పొడిచేస్తే నువ్వుల పప్పు పొడి అవదు. ముద్ద అవుతుంది.

బాణెలి లో నూనె వేసి పోపు వేసుకుని, వేగాక కూరముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి కొంచెం మగ్గనివ్వలి.కూర ముక్కలు మగ్గి నీరు తగ్గిన తరువాత నువ్వుల పొడి వేసుకోవాలి.

అంతే కూర తయారు.ఇలాగే సొరకాయ, పొట్లకాయ, గోరుచిక్కుడు కూడా చేసుకోవచ్చు, గోరుచిక్కుడు కూరకైతే ముక్కలు ముందుగా ఉండికించుకోవాలి.

మొలకెత్తిన పెసల కూర



కావలసిన పదార్థాలు :


మొలకెత్తిన పెసలు - 1 కప్పు
టొమేటోలు - 4
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 1 కట్ట
నూనె, ఉప్పు - తగినంత
జీలకర్ర - 1/2 టీస్పూన్‌
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 2 టీస్పూన్స్‌
ఉల్లిపాయలు - 2
క్యారెట్‌, క్యాప్సికమ్‌ తరుగు - 1/2 కప్పు

తయారు చేసే విధానం :

ముందుగా మొలకెత్తిన పెసలను ఉడికించి, వడగట్టి పెట్టుకోవాలి. తరువాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. అందులోనే పచ్చిమిర్చి, క్యారెట్‌, క్యాప్సికమ్‌ తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి దొరగా వేయించాలి. వేయించాక అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, టొమేటో ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత ఉడికించిన పెసల్ని వేసి కలిపి, ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి, చివర్లో కొత్తిమీర చల్లి దించాలి. అంతే ఇది అన్నంలోకైనా, బ్రెడ్‌ ముక్కల మధ్యలో ఉంచి సాండ్విచ్‌లాగా తినడానికైనా, రోటిలోకైనా బాగుంటుంది.

సగ్గుబియ్యం వడ

  


కావలసినవి : 

సగ్గుబియ్యం: 1 కప్పు 
బంగాళాదుంప: ఒకటి 
బియ్యప్పిండి: 5 స్పూన్లు 
ఉల్లిపాయ: ఒకటి 
అల్లం: ఒక ఇంచ్ 
పచ్చిమిర్చి: 3-5 
మజ్జిగ: సగం కప్పు 
నూనె: వేయించడానికి సరిపడా 
ఉప్పు: సరిపడ 

తయారుచేసే విధానం 

సగ్గుబియ్యం, మజ్జిగలో గంటసేపు నాననివ్వాలి. 
ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. 
బంగాళాదుంప ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి 

ఇప్పుడు సగ్గుబియ్యం, చిదిమిన బంగాళాదుంప, ఉల్లిపాయముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, బియ్యప్పిండి, ఉప్పు అన్నీ వేసి కలపాలి. 
బాణలిలో నూనె వేసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి.

Monday, July 30, 2012

పనసపొట్టు కూర



కావలసిన పదార్థాలు: 

పనసపొట్టు - 2 కప్పులు, 
ఎండుమిర్చి -5, 
ఇంగువ - 2-3 చిటికెలు 
ఆవాలు - 2-3 టీ స్పూన్లు, 
అల్లం ముక్క - ఒక ఇంచ్ 
మినప్పప్పు - 2 టీ స్పూన్లు, 
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్లు, 
కరివేపాకు - 4 రెబ్బలు, 
చింతపండు రసం - 2-3 స్పూన్లు 
పసుపు - అర టీ స్పూను, 
ఉప్పు - రుచికి తగినంత, 
నూనె - 2 టేబుల్ స్పూన్లు 
చిట్టొడియాలు (మినప వడియాలు చిన్నవి)- 6-10 వరకు 

తయారుచేసే విధానం: 

పనసపొట్టుని మూడొంతులు నీరున్న పెద్ద పాత్రలో వేసి బాగా కడిగి నీటిపై తేలిన పొట్టును మాత్రం తీసుకోవాలి. 
ఇందులో తగినంత నీరు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి నీరు వార్చి చల్లారనివ్వాలి. 

ఎండుమిరపకాయలను (3 లేక 4), ఆవాలను కాసేపు నీళ్ళల్లో నానపెట్టుకొని, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. 

తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు వేగాక ఉడికించిన పనసపొట్టుని కలపాలి. సన్నని సెగమీద నీరంతా ఇగిరిన తర్వాత అందులో చింతపండు రసం వేసుకోవాలి. 
తరవాత ఆవముద్ద కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, మూత పెట్టుకోవాలి. తినే ముందు వేయించిన చిట్టొడియాలు కలుపుకొని తింటే బాగుంటుంది.( పోపు వేగినతరవాత కాస్త పోపు తీసుకొని తినేముందు కలుపుకొని తింటే కటకట పోపుతో కూర చాలా బాగుంటుంది. కొంత మంది పోపులో పళ్ళీలు కూడా వేసుకుంటారు.)

Saturday, July 28, 2012

కందా బచ్చలి కూర

కావలసినవి: 

కంద ఒక చిన్న ముక్క ( అర కే.జి) 
బచ్చలి రెండు కట్టలు( బచ్చలి ఎక్కువ వేస్తే జారుగా ఉంటుంది కూర) 
చింతపండు రసం నాలుగు- ఐదు చెంచాలు 
ఉప్పు తగినంత 
నూనే 2 - 3 స్పూన్లు 
పోపుకి: 
ఆవాలు 1/2 స్పూను 
మినపప్పు 1 స్పూను 
సెనగపప్పు 2 స్పూను 
ఎండు మిరపకాయ 4 
కరివేపాకు పోపుకి తగినంత 
సన్నగా తరిగిన పచ్చిమిరప కాయలు 8 - 10 
సన్నగా తరిగిన అల్లం 1 అంగుళం 

ఆవకి: 
ఆవాలు 4 స్పూన్లు 


తయారీ విధానం: 
కందని చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి బాణలిలో వేసి ఉడికించు కోవాలి. కంద కాస్త మెత్తగా ఉడికాక సన్నగా తరిగిన బచ్చలి కూడా కందతో పాటు ఉడకనివ్వాలి. బచ్చలి కూడా మెత్తబడ్డాక( ఉడుకుతూ ఉండగానే) చింతపండు రసం, తగినంత ఉప్పు,మరి కాసేపు(ఒక 5 నిముషాలు) ఉడకనివ్వాలి. ఇప్పుడు నీటిని వడబోసి కందబచ్చలి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. 

బాణలిలో 2 స్పూన్లు నూనే వేసి పోపు సామగ్రి వెయ్యాలి, అవి కాస్త చిటపటలాడాకా కంద బచ్చలి మిశ్రమాన్ని వేసి కాస్త మగ్గనివ్వాలి. గరిటతో చిదమి కూర కాస్త ముద్ద గా చేసుకోవాలి.. 

ఆవ ముద్ద( ఆవ, అల్లం, పచ్చి మిర్చి, ఒక ఎండు మెరపకాయ, ఇంగువ ) చేసుకొని ఉడికించుకొన్న కూర వేసుకోని మూత పెట్టుకొని ఒక్క నిముషం చిన్న మంట మీద మళ్ళీ ఉంచుకోవాలి. 
అంతే కందా బచ్చలి కూర రెడీ

పెసరపునుగులు



పెసరగుల్లు : ఒక కప్పు 
ఉల్లిపాయ పెద్దది 1 
పచ్చిమిర్చి 4 - 8 
కొత్తిమీర 
అల్లం - ఒక ఇంచు 
ఉప్పు తగినంత 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడ్డా 

పెసర గుళ్ళు ( పెసర పప్పు అయినా పర్వాలేదు) ఒక రెండు గంటలు నాన పెట్టుకోవాలి. అలా నాన పెట్టిన పెసలు రుబ్బుకొని( మరీ మెత్తగా వద్దు) అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ చెక్కు, పచ్చి మిర్చి అల్లం ముద్ద, కొతి మీర , తగినంత ఉప్పు వేసుకొని, అవి చిన్న చిన్న ఉండల లాగా నూనె లో వేసుకొని వేయించుకోవాలి. ఒక 3-5 నిమిషాలు వేగితే చాలు. వేడిగా టమాట పచ్చడితో తింటే చాలా బాగుంటాయి.

Wednesday, July 25, 2012

కొట్టక్క బుట్ట



కావల్సినవి : 

రెండు కప్పుల మినపగుళ్ళు 
నాలుగు కప్పుల వరి నూక 
ఉప్పు తగినంత 

మినపగుళ్ళు ఒక ఆరుగంటల పాటు నానపెట్టుకొని మెత్తగా రుబ్బుకొని నాన పెట్టిన వరినూక, ఉప్పు(కావల్సిన వారు పచ్చి మిర్చి అల్లం ముక్కలు వేసుకోవచ్చు) కలుపుకొని ఒక ఆరు గంటల పాటు నాన నివ్వాలి 
పనసాకులు ఒక బుట్టగా కుట్టుకొని అందులో ఈ పిండి పోసుకొని పెద్ద గిన్నెలో నీరు పోసుకొని అందులో ఒక ప్లేట్లో వీటిని ఆవిరిపెట్టాలి. ఒక పది నిమిషాల తరవాత బాగా ఉడికిన కొట్టక్క బుట్టలు రెడి. వీటిని ఆవకాయతో కాని శెనగ పచ్చడితో కాని తింటే బాగుంటుంది.

బీన్స్ కొబ్బరికోరు కూర



కావల్సినవి : 

బీన్స్ - పావు కే.జి. 
కొబ్బరి తురుము - 1 కప్పు 
ఆవాలు - 1/2 త్స్ప్ 
శెనగపప్పు - 1/2 స్పూన్ 
మినపప్పు 1/2 స్పూన్ 
జీలకర్ర 1/2 స్పూన్ 
ఇంగువ - చిటికెడు 
ఎండుమిరపకాయ - 3 
కరివేపాకు - 4 రెబ్బలు 
నూనె 2-3 స్పూన్లు 
ఉప్పు తగినంత 

బీన్స్ సన్నగా తరిగి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి అవి చిటపట లాడాక ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చాకా ఉడికించిన బీన్స్ వేసి, ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగాక అప్పుడు కొబ్బరి కోరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి, ఆ వేడికే కొబ్బరి ఉడుకుతుంది. కొబ్బరి వేగితే వాసన బాగోదు.

అటుకుల ఉప్మా

కావల్సినవి : 

అటుకులు--3 కప్స్ 
ఉల్లిపాయ--1 
టమొటా--1 
అల్లం--చిన్న ముక్క 
పచ్చి మిర్చి--3 లేక 5 
నూనె--1 స్పూన్ 
నెయ్యి--1 స్పూన్ 
కరివేపాకు--1 రెమ్మ 
కొత్తిమీర--2 రెమ్మలు 
పసుపు--1/2 స్పూన్ 
శనగ పప్పు, మినపప్పు ,జీలకర్ర,ఆవాలు - 1 స్పూన్ 

విధానము: 
1.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి. 

2.బానలి లో కొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక, పోపు వేసి, వేగినాక చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, మిర్చి, వేసి ఉల్లిపాయలు ఎర్రాగ వేగేంత వరకు వేయించాలి. 

3.తరువాత పసుపు, కరివేపాకు వేయాలి.తగినంత ఉప్పు వేయాలి. 

4.అటుకులు నీళ్ళలో కడిగి, నీరు లేకుండా గట్టిగా పిండి, పక్కన పెట్టుకోవాలి. 

6.తరువాత వేయించిన ఉల్లిపాయ మిశ్రమము లో గట్టిగా పిండి, పక్కన పెట్టుకున్న అటుకులను వేసి బాగా కలిపి 2 నిముషాలు మూత పెట్టాలి. 

అంతే ముగ్గురికి సరిపడ అటుకులుప్మా తయారు. 

పైన కొత్తిమీర వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. కొందరు ఈ ఉప్మాలో ఉడికించిన ఆలు, బీన్స్, బఠానీలు , కారట్టు ముక్కలు వేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది.